అనువాద నిపుణులపై ఆర్ధికంగానూ మరియు మానసికంగానూ ప్రభావం చూపుతున్న AI వల్ల అనువాద రంగంలో వస్తున్న మార్పుల గురించి తెలుసుకోండి.
ప్రతి ఒక్కరూ AI గురించి మాట్లాడుతున్నారు, ప్రతి రంగంలోనూ దాని ప్రభావం పెరుగుతున్నది. అనువాద రంగం ఏమీ మినహాయింపు కాదు. మీరు ఒక అనువాదకులు అయితే, బహుశా ఇప్పటికే మీకు ఈ ఇబ్బంది అర్థమై ఉంటుంది. ఈ రంగంలోని నిపుణులకు AI ఆర్ధికంగా మరియు మానసికంగా సవాళ్ళను విసురుతున్నది.
AI రాకతో ప్రతి ఒక్కరూ తామే అనువాదాన్ని ఉచితంగా చేసుకోగలము అనుకుంటున్నారు. వాస్తవానికి అది అనుకున్నంత సులువుకాదు.
మెయిలర్ కొరకు
మా సిఎండి సంజయ్ షా అందించిన అనువాదము (లోకలైజేషన్) పై వ్యాసాన్ని చదవండి మరియు భాషా నిపుణులు ఒక అంశాన్ని అందించుటకు ఎంతో శ్రమించినప్పటికీ, గుర్తింపు లేనివారిగా మిగిలిపోతున్నారు అని తెలుసుకోండి. ఇప్పటి AI కాలములో, వారి తప్పు లేకుండానే శిక్షించబడుతున్నారు.
పెరుగుతున్న అనుమానాలు మరియు ఆరోపణలు
ఈ AI రావడంతో అనువాదకులకు విలువ లేకుండా పోయిండి. కష్టపడి అనువదిస్తే, క్లయింట్లు మాత్రం ఇది AI పని లాగా ఉందే, అనే అనాధారిత ఆరోపణలు విసురుతున్నారు. అక్షరంపై ఆసక్తి, బాషపై ప్రేమ ఎవరికీ కనిపించట్లేదు. వీళ్ళ పని బాగుందే, కేవలం నాలుగు బటన్లు నొక్కి అనువాదం అయిందనిపిస్తున్నారు, అనే అనుమానాలు, వెటకారాలు ఎక్కువయ్యాయి.
ఇంకా దురదృష్టకరం ఏమిటంటే, ఎలాంటి రుజువు లేకుండా AI ఉపయోగిస్తున్నారు అని క్లయింట్లు తరచూ అనువాదకులను నిందిస్తున్నారు. ఇది మానవీయంగా లేదు అని వాళ్ళు అంటారు. ఇలాంటి ఆరోపణలు అవాస్తవాలు. అనువాదకులు సమయాన్ని మరియు శ్రమను వెచ్చిస్తారు. కాని AI ఉపయోగిస్తున్నారని నిందించడం వారిని చెంపదెబ్బ కొట్టడం వంటిది.
AI వర్సెస్ మానవ అనువాదము: పొంతనలేని పోలిక
అనువాదకుడి పనికి, AI ఉపయోగించి చేసిన పనికి చాలా వ్యత్యాసమే ఉంటుంది. నేనూ AI వాడతాను, కానీ ఎంతవరకూ వాడాలో అంతవరకే. నా పనికి మెరుగులు దిద్దడానికి పనికొస్తుంది. కానీ మొత్తం పనికి దానిపై ఆధారపడితే, నట్టేటముంచేస్తుంది.
మీరు ఒక్కసారి ఆంగ్లము నుండి ఏ గుజరాతీకో, ఏ తెలుగుకో అనువదించి చూడండి, ఈ AIలో. దాని అనువాదం చూసి మీరే నవ్వుకుంటారు. ఒక్కోసారి, సరి చేయలేనన్ని తప్పిదాలు ఉంటాయి. ఇది వాడిన తరువాత మాత్రమే తెలుస్తుంది, దీన్ని కేవలం ఒక పనిముట్టుగా వాడుకోవాలే తప్ప, పని మొత్తం అప్పగించేయకూడదు అని.
భారతీయ బాషలతో AI ఇక్కట్లు
AI అన్నది ఆంగ్లబాషకు ఏమైనా పనికొస్తుందేమో కానీ, వ్యాకరణం సంక్లిష్టంగా ఉండే భారతీయ బాషలకు పనికిరాదు. ఒక్కసారి దీన్ని భారతీయ బాషలైన మరాఠీ, గుజరాతీ వంటిలో వాడితే, అనువాద ప్రతిలో ఇబ్బందికరమైన తప్పులు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ అనువాదాలు మొదటి నుండి తిరిగి చేయవలసి వస్తుంది.
ఒక వృత్తిపరమైన అనువాదకుడు ప్రతిసారి తన పనిని తన సొంతమైనదిగా, AI పని కాదని నిరూపించుకోవడం ఎంతటి కష్టమో ఆలోచించండి. దీని వల్ల, సమయం, శక్తి వృధా అవ్వడమే కాకుండా, అనువాదకుడుని అసహనానికి గురిచేస్తుంది.
పర్సనల్ కాస్ట్: పని మరియు ప్రేరణను కోల్పోతున్న అనువాదకులు
AI పనితీరులోని లోపాలే కాకుండా, మరింత ఎక్కువ నష్టం చేకూర్చే విషయం ఏంటంటే, ఇది అనువాదకుల మనసు విరిచి, పనిపై వారి ప్రేరణను తగ్గిస్తుంది. ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్న అనువాదకులు ఇప్పుడు పని వెతుక్కోడానికి కష్టపడుతున్నారు. AI వల్ల పని జరుగుతుందని భావించి భ్రమించే క్లయింట్లు, అనువాదక వృత్తిని ఒక నిస్సారమైన, విలువలేని పనిగా మార్చేస్తున్నారు.
అన్నిటికన్నా తీవ్రమైన అంశం ఏమిటంటే, అనువాదకులు కష్టపడి పనిచేసి ఇస్తే, క్లయిట్లు ఇది AI ఉపయోగించి చేసారా అని ఆరోపిస్తే, దెబ్బ తగిలేది ఆర్ధికంగా మాత్రమే కాదు. మానసికంగా కూడా. అనువాదకుల మనసు విరిగిపోతుంది మరియు వారికి పని పట్ల ప్రేరణ తగ్గుతుంది. పైగా ఇలా అనాధారిత ఆరోపణల వల్ల, అనువాదకులపై చిన్నచూపు ఏర్పడి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది.
చాలామంది అనువాదకులు తమ కెరీర్ గురించి పునరాలోచిస్తున్నారు. ఇప్పటికే వారికి చాలా తక్కువ జీతం అందుతోంది మరియు కొన్ని సంవత్సరాలుగా తక్కువగా చూస్తున్నారు. ఇప్పుడు వారిపై నమ్మకం కూడా లేదు. ఎప్పుడు కృతజ్ఞత లేని ఉద్యోగముగా చూడబడే అనువాదము, ఇప్పుడు AI ద్వారా నిర్వహించుకోవచ్చు అని భావించబడుతోంది.
భారతీయ బాషలకు రెండువైపులా-పదును ఉన్న కత్తి
భారతీయ బాషల అనువాదాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి, గ్రాంధికంగా, ప్రాంతీయ-బాషకు చెందినవిగా ఉంటాయి. మరొకటి వాడుక బాష, ఇందులో ఆంగ్లముతో పాటు వేరే బాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు ఉంటాయి.
ఒకవేళ అనువాదకులు అసలైన భాషను ఉపయోగిస్తే, “అర్థం కావడం లేదా? మీకు తెలియదా? భారతదేశములో ప్రతి ఒక్కరు ఆ పదానికి ఇంగ్లీష్ వాడతారు! దానిని మీరు ఎందుకు అనువదించారు?” మరొకవైపు, అనువాదములో ఇంగ్లీష్ పదాలు వాడితే, ఆంగ్లీకరించారని విమర్శిస్తారు. ఎలా చూసినా గెలుపు లేని పరిస్థితే.
మానవ నైపుణ్యాన్ని AI ఎప్పుడూ భర్తీ చేయలేదు
అందరూ ఒక్క విషయం గమనించాలి. AI ఎప్పటికీ అనువాదకులను పూర్తిగా భర్తీ చేయలేదు. AIకి సృజనాత్మకత, సున్నితత్వము మరియు సాంస్కృతిక అవగాహన లేనందున అత్యుత్తమమైన అనువాదాన్ని ఎప్పటికీ అందించలేదు. ఒకే పదన్ని వివిధ సంధర్భాలలో వివిధ అర్ధాలు వచ్చేలా మనం వాడతాం. ఇది అనువాదకులకు మాత్రమే అర్ధమవుతుంది.
మహా అయితే, AI యాంత్రికంగా అనువదించగలదేమో కానీ దానిలో జీవం ఖచ్చితంగా ఉండదు. ఇది సాధారణ, ఫక్తు అనువాదాలకు పనికొస్తుందేమో కానీ, అర్ధవంతమైన అనువాదనకు ఆమడ దూరంలో ఉంటుంది. AI ఎంత ఎదిగినప్పటికీ, మనిషి తన నైపుణ్యాన్ని, తన సృజనాత్మకతను మరియు అనుభవాన్ని రంగరించి అందించిన అనువాదానికి సాటిరాదు.
AI ఎక్కడ పనికొస్తుంది?
AI వల్ల లాభలు కూడా ఉన్నాయి. ఇది ఎలా సహాయం చేస్తుందో చూడండి:
- సమయం ఆదా: రిఫరెన్సులను ఒకచోట చేర్చి సమయాన్ని ఆదా చేస్తుంది.
- పర్యాయపదాలను పెంచడము: పదాలు రిపీట్ అవ్వకుండా, సరిపోయే ఇతర పదాలను సూచించగలదు.
- ప్రత్యామ్నాయ రచనా శైలులు: వివిధ రకాల శైలిలో ప్రయత్నాలు చేయవచ్చు.
- పరిభాష మరియు వాక్యాలను కనుగొనడము: ఇది వెంటనే స్ఫురించని పదాలను, ముఖ్యంగా సాంకేతిక లేదా ప్రత్యేక అంశాల పదాలను కనుగొనడంలో సహాయం చేస్తుంది.
- ఆంగ్ల వ్యాకరణము మరియు పంక్చుయేషన్ మెరుగుపరచడము: ఆంగ్లములో వ్యాకరణ దోషాలను సరిచేసుకోవచ్చు.
- త్వరిత డ్రాఫ్ట్స్: రొటీన్ పనులు చేయడానికి దీని సహాయం తీసుకోవచ్చు.
- రొటీన్ కంటెంట్ జనరేషన్: ఇది సులభమైన, వాస్తవమైన కంటెంట్ ను సమర్థవంతంగా నిర్వహించగలదు. కాని, చివరిలో దీని తప్పు వివరణ కారణంగా వచ్చే తప్పులు మరియు చట్టపరమైన ఇబ్బందులు లేకుండా మాన్యువల్ గా చూడాలి.
- డేటా అంతర్దృష్టులు: AI పెద్ద డేటాసెట్స్ ను విశ్లేషించగలదు మరియు సారాంశాలు మరియు ధోరణులను ఉత్పన్నం చేయగలదు.
క్లయిట్లకు ఒక సందేశం
మీరు ఒక అనువాద నిపుణుడిని నియోగించినప్పుడు, వారి సామర్ధ్యంపై నమ్మకం ఉంచండి. మీకు ఏమైనా మార్పులు కావాలంటే అడగండి, కానీ ఆధారాలు లేకుండా AI ఆరోపణలు చేయకండి.
అనువాద నిపుణులను గౌరవించండి. ఒక మంచి అనువాదకుడు కేవలం పదాలను మాత్రమే అనువదించట్లేదు, ఆ సందేశంలోని సారాన్ని, భావాన్ని ఎలాంటి తప్పులు లేకుండా అర్ధమయ్యేలా అనువదించడానికి ప్రయత్నిస్తారు. అనుకున్న సందేశం చేరేలా చూస్తాడు. ఏ AI ఇలా చేయలేదు!
ముందస్తు-అనువాదానికి క్లయింట్ల తప్పుదోవపట్టించే వైఖరి
చాలామంది క్లయింట్లు కంటెంట్ ను కావలసిన భాషలోకి ముందుగా అనువదించి, అనువాదకులకు షేర్ చేస్తూ, “మీ పనిలో సగం మేము చేసేశాము. ఇప్పుడు అవసరమైన విధంగా దానిని సరిచేసి అందించండి” అని సూచనలు ఇస్తారు. నిజానికి, వీళ్ళు చెప్పాలని అనుకునేది ఏమిటంటే, “మేము ఇక్కడ అక్కడ కొన్ని బటన్స్ నొక్కి, మిమ్మల్ని, మీ ఫీజును అణచివేయగలము మరియు మాకు కూడా అనువదించడం తెలుసు”. కాని ఒక అనువాదకుడికి, ప్రతి ఒక్క పదాన్ని చెక్ చేస్తూ రెండు భాషలలో కంటెంట్ ను పోల్చి చూస్తూ, వాటిని సరిచేయడం కంటే టార్గెట్ భాషలోకి కంటెంట్ ను నేరుగా అనువదించడం చాలా ఆనందించదగినది.
ముగింపు: కథనాన్ని మార్చుటకు సమయం
మన ప్రపంచీకరణ ప్రపంచములో అనువాద వృత్తినిపుణులు గుర్తించబడని నాయకులు. AI అన్నది కేవలం ఒక సాధనం మాత్రమే. అనువాద రంగాన్ని నడిపిస్తున్నది బాషా నిపుణులైన అనువాద సైనికులు. అనువాదకుడు తన మనస్సు, మెదడు పెట్టి పని చేస్తే, దాని ఫలితం గొప్పగా ఉంటుంది. ఈ మధ్య AI పేరు గట్టిగా వినిపిస్తున్నప్పటికీ, అర్ధవంతమైన, సాంస్కృతికంగా సరిపోలే అనువాదాన్ని ఇచ్చేది అనువాద నిపుణులే.
గమనిక: ఈ ప్రక్రియలో నేను AI సహకారాన్ని తీసుకున్నాను, కాని ఇక్కడ అందించిన ఆలోచనలు మరియు అభిప్రాయాలు నావే. మా చర్చలు నా ధోరణిని సరిచేసుకొనుటకు సహాయపడ్డాయి. AI ని ఒక భర్తీచేయదగిన సాధనముగా కాకుండా మానవ సృజనాత్మకతను పెంచే ఒక సాధనముగా మాత్రమే ఉపయోగించాలి. ఇలాంటి సృజనాత్మక పనులకు AI చాలా ఉపయోగకరమైన సాధనము అయినప్పటికీ, అనేక భాషలలో ప్రభావవంతమైన, ఖచ్ఛితమైన అనువాదము విషయములో ఇది అంత శక్తివంతమైనది కాదు.
ఈ క్రింది కమెంట్స్ లో మీ అభిప్రాయాలను షేర్ చేయాలని కోరుతున్నాను. ఈ కీలకమైన అంశముపై మీ ఆలోచనలను తెలుసుకొనుటకు ఎదురుచూస్తున్నాను!